×

భద్రాద్రికి అందని ద్రాక్షగా రైల్వే లైన్..ఏర్పాటు చేసేదెవరు?

భద్రాద్రి కొత్తగూడం ( లలితా పీఠం) : దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన భద్రాచలం రామాలయంపై పాలకులకు కనికరం కలగటం లేదు. దేశం నలుమూలల నుంచి రోజు వేలాది మంది భక్తులు భద్రాద్రి రామున్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. అయితే భద్రాచలానికి రైల్వేలైన్ సౌకర్యం లేకపోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం రావాలంటే రైల్వే సౌకర్యం లేకపోవటంతో వృద్ధులు, వికలాంగులు రాలేకపోతున్నారు. గత మూడు దశాబ్దాల కాలంగా భద్రాచలానికి రైల్వేలైన్ అందని ద్రాక్షగానే మిగులుతోంది. యూపీఏ హయాంలో భద్రాచలానికి రైల్వేలైన్ ప్రతిపాదనలను కేంద్ర బడ్జెట్లో ఆమోదించారు. అయితే పదేళ్ల యూపీఏ పాలనలో భద్రాచలం రైల్వే లైన్ ప్రతిపాదనలకే పరిమితమైంది. వరుసగా రెండు పర్యాయాలు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా భద్రాచలం రైల్వేలైన్ కలగానే మిగిలింది. నిత్యం రామనామం జపించే ఎన్డీఏ పాలకులు భద్రాచలం రైల్వేలైన్ ఊసే మరిచారు.

ఈ నేపథ్యంలో రామయ్య భక్తులకు తంటాలు తప్పడం లేదు. గత 30 ఏళ్లుగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంత ప్రజలు భద్రాచలం వరకు రైల్వేలైన్ విస్తరించాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడం జిల్లా బూర్గంపాడు మండలంలోని పాండురంగాపురం రైల్వేస్టేషన్ నుంచి సారపాక వరకు రైల్వేలైన్ విస్తరిస్తే భద్రాచలం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. దేశం నలుమూలల నుంచి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని పాండు రంగాపురం రైల్వేస్టేషన్ నుంచి సారపాక వరకు కేవలం 13 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ ను విస్తరిస్తే భద్రాచలం వచ్చే భక్తులకు, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏజెన్సీ ప్రాంత ప్రజలు సారపాక వరకు రైల్వే లైన్ ను విస్తరించాలని ఏళ్ల తరబడి కోరుతున్నారు.

 కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రిగా బండారు దత్తాత్రేయ పనిచేసిన కాలంలో ఈ రైల్వేలైన్ను విస్తరిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అప్పుడు రైల్వేలైన్ విస్తరణ ఆశలు అడియాశలే అయ్యాయి. అదేవిధంగా యూపీఏ ప్రభుత్వహయాంలో నాటి కేంద్రమంత్రి, భద్రాచలం పార్లమెంట్ సభ్యులు పొరిక బలరామ్ నాయక్ ఈ రైల్వే లైన్ విస్తరణకు నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. కానీ రైల్వేబడ్జెట్లో మాత్రం అలాంటిదేమి లేకపోయింది. కేవలం యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ రైల్వేలైన్ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను మాత్రం రైల్వేబడ్జెట్లో ఆమోదించారు. నాటి నుంచి నేటి వరకు ఈ రైల్వేలైన్ విస్తరణకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ కూడా ముందుకుసాగలేదు. ఈ నేపథ్యంలో ఇకనైనా ఈ రైల్వే లైను విస్తరించి భద్రాచలం రాములవారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

  • January 27 , 2023
  • 10:12 am