×

వారం రోజుల పాటు అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ఏ రోజున ఏ కార్యక్రమం జరగనుందంటే ?

భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది జనవరి 22 వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరి అయోధ్యలో దివ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అయోధ్య రామాలయంలో వారం రోజుల ముందు నుంచే ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 15 వ తేదీన ప్రారంభం కానున్న ఈ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు 22 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 22 వ తేదీన అయోధ్య గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

జనవరి 15 వ తేదీ నుంచే అయోధ్యలో యఙ్ఞ క్రతువులు ప్రారంభం కానున్నాయి. జనవరి 15 వ తేదీన మకర సంక్రాంతితో అశుభ కాలం ముగియడంతో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురానున్నారు. ఇక ఆ తర్వాతి రోజు జనవరి 16 వ తేదీన శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ఆచారాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనే బ్రాహ్మణులు దీక్షను స్వీకరించనున్నారు. ఇక జనవరి 17 వ తేదీన శ్రీరాముని విగ్రహాన్ని నగర ఊరేగింపు చేయనున్నారు. ఆ రోజే అయోధ్య రామ మందిరంలో కొలువు దీరనున్న రాముడి విగ్రహం ప్రపంచానికి తెలియనుంది.

మరోవైపు.. జనవరి 18 వ తేదీన మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేశ పూజ వంటి ఆచారాలతో సహా ప్రాణ ప్రతిష్ఠ పవిత్రోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక జనవరి 19 వ తేదీన అయోధ్య రామ మందిరంలో యజ్ఞ అగ్ని గుండాన్ని స్థాపించనున్నారు. ఒక ప్రత్యేకమైన ఆచారం ప్రకారం.. పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. ఒక కర్రను మరో కర్రతో మధిస్తూ అగ్నిని రాజేస్తారు. ఇలా వచ్చిన అగ్నితో ఆ యఙ్ఞాన్ని ప్రారంభించనున్నారు. ఇక జనవరి 20 వ తేదీన వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో పుణ్యహవచనం కార్యక్రమం ద్వారా రామమందిరం యొక్క గర్భగుడిని వేద మంత్రాలతో పవిత్రం చేస్తారు.

 

జనవరి 21 వ తేదీన జలాధివాసం అంటే యజ్ఞం చేసిన అనంతరం, ప్రత్యేక పూజల మధ్య అయోధ్య రాముడి విగ్రహాన్ని125 కలశాలతో అభిషేకం చేస్తారు. ఇక జనవరి 22 వ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలోని ప్రధాన కార్యక్రమం అయిన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి పూజ జరుగుతుంది. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు పవిత్ర సమయం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకనుల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య 84సెకన్ల పాటు రాముడి విగ్రహాన్ని.. గర్భగుడిలో కేటాయించిన స్థలంలో ప్రతిష్టించనున్నారు. ఇక జనవరి 24 వ తేదీ నుంచి అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతివ్వనున్నారు.

  • January 09 , 2024
  • 09:39 am