వాస్తు శాస్త్రము (వాస్తు పురాణం):
పూర్వకాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాలవాసులను ముప్పతిప్పులు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళ వదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమక్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించ సాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణు వేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి ఆ భూతమును ఆధోముఖంగా భూమి యందు పడవేసి విధానం చెప్పాడు. బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు. ఆ భూతం భూమిపై ఈశన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోణాలందు బాహువులు వుండునట్లు ఆధోముఖంగా భూమిపై పడింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై కూర్చున్నారు. ఇంతమంది దేవతల తేజస్ర్సముదాయంతో దేదీవ్యామానంగా వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మ దేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా సృష్టి గావించాడు. వాస్తు పురుషుడు భాద్రపద బహుళ తదియ, శనివారం, కృత్రిక నక్షత్రము, వ్యతీపాత యోగము, భద్రనా కరణము గుళికతో కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు. ఏ అపకారం చేయని నాపై అధిష్టించి ఈ దేవతలు పీడించుచున్నారు. వీరి నుండి నన్ను కాపాడమని వాస్తు పురుషుడు బ్రహ్మదేవున్ని వేడుకున్నాడు.అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి వాస్తు పురుషా ! గృహములు నిర్మించునప్పుడు, త్రివిధమయిన గృహ ప్రవేశ సమయములందు, గ్రామ, నగర పట్టణ, దుర్గ దేవాలయ, జలాశయ, ఉద్యానవన నిర్మాణ సమయములందు ముందుగా నిన్నే పూజిస్తారు. అలా పూజించని వారికి దరిద్రముతో పాటు అడుగడుగునా విఘ్నములు చివరకు మృత్యువు కూడా సంభవించునని వాస్తు పురుషునికి వరమిచ్చారు. అంతేకాక వాస్తు పరుషునిపై అష్టదిక్కులలో వున్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థలాలలో నివసించే దేవతలు వారివారి విధులు నిర్వహించుట వలన గృహస్థులకు సర్వసుఖములు, సత్ఫలితులు కలుగునట్లు అశీర్వదించారు. బ్రహ్మదేవుని ఆశీస్సులు ప్రకారము ఈశాన్యమున – ఈశ్వరుడు (ఈశ), ఆగ్నేయమున – అగ్ని, నైరుతిన ఆదిత్యుడు, వాయువ్యమైన – వాయువు, తూర్పున – వరుణుడు, ఉత్తరమున – కుబేరుడు (సోమ), అష్టదిక్కులలో అధిష్టించిన ఈ దేవతలు తృప్తి చెందే విధంగా నిర్మాణ క్రమం వుంటే ఆ గృహంలో నివసించే వాళ్లు సర్వసుఖ సంపదలను పొందుతారు. ఇదీ వాస్తు – పురాణం, ఈశాన్యములో పూజలు, పవిత్ర కార్యములు అగ్నేయమున అగ్నిదేవునికిసంబంధించిన వంటావార్పు నైరుతిన ఆయుధ సామాగ్రి, వాయువ్యమున స్వతంత్రాభిలాష చిహ్నములు, తూర్పున ఆధిత్యునికి ప్రీతికరమైన పనులు,యమస్థానమైన దక్షిణము శిరస్సు ఉంచి నిద్రించుట, కుబేర స్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేలు కొనుట, వరుణ స్థానమైన పశ్చిమాన పాడి పశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు తృప్తిని కలిగిస్తాయి. ఈ సారాంశాన్ని వాస్తు శాస్త్రం నియమాలు మనకు వెళ్లడిస్తున్నాయి. గృహ నిర్మాణాలు చాలా రకాలు వీటిలో మనష్యోపయుక్తములు, పశవులకు సంబంధించిన నిర్మాణాలు, పక్షులకు సంబంధించిన నిర్మాణాలు దేవతలకు సంబంధించిన నిర్మాణాలు ఇలాగ అనేక విధాలుగా వున్నాయి.
(1) సాధారణ మనుష్య నివాసములు
(2) ప్రభు నిర్మాణములు
(3) దేవతా నిర్మాణములు
(4) సర్వసాధారణ ప్రజోపయోగ నిర్మాణాలు. సామాన్యంగా ప్రతి గృహస్తులకు అవసరమైన సదుపాయములను గురించి మార్పులతో నిర్మాణాలు చెప్పబడియున్నవి.
1. మనిషికి అవయవాలు ఎంత ముఖ్యమో గృహ స్థలానికి అష్టదిక్కులు కూడా అంతే ప్రధానమైనవి.
2. శివాలయానికి ఎదురు, విష్ణు ఆలయానికి వెనుక నివాస గృహములు నిర్మించరాదు.
3. వాస్తు దోషము వున్న ఇంటిలోపల నివసిస్తే అష్టకష్టాలు కలుగుతాయి.
4.తులసికోటను దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, తూర్పు ఆగ్నేయం ఉత్తర వాయవ్య భాగాలలో ఏర్పాటు చేయాలి.
5. స్థలం విశాలంగా వుండి, ఇల్లు చిన్నదిగా వుంటే దక్షిణ, పశ్చిమ వీధులు గల స్థలాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
6. ఈశాన్యంలో పిల్లల పడకగది, తూర్పు ముఖంగా వంట చేయడం ఎన్నో శుభాలు కలిగించును.
7. పశ్చిమ వాయువ్యము నుండి తూర్పు ఈశాన్యాలలో నడక ఉజ్జ్వల భవిష్యత్తుకు గొప్ప పునాధులు వేస్తుంది.
8. ఈశాన్యం తగ్గి వున్న స్థలాలను కొనగూడదు. ఇటువంటి స్థలాలను స్వంతం చేసుకున్నా ఇల్లు కట్టుకున్నా ఆ యజమానికి అభివృద్ధి కుంటుపడుతుంది. వంశాభివృద్ధి క్షీణిస్తుంది.
9. మీకు ముందే ఒక స్థలం వుంటే దానికి తూర్పున గాని, ఉత్తరాన గాని ఉన్నస్థలాన్ని కొనవచ్చు. దక్షిణ, పడమర వైపుల్లో ఉన్న స్థలాన్ని కొనకూడదు. ఈశాన్యంలో వున్న స్థలం అమ్మకానికి వస్తే ఎక్కువ రేటు చెల్లించి అయినా దాన్ని మన సొంతం చేసుకోవాలి.
10. తూర్పు ఈశాన్య స్థలంలో బావి త్రవ్వించుకుంటే యజమానికి పేరు ప్రతిష్టలతో పాటు వంశాభివృద్ధి సకల సంపదలతో తులతూగుతారు.
11. తూర్పు, తూర్పు ఈశాన్య భాగంలో భూగృహ నిర్మాణం చేస్తే అది ఎన్నో శుభాలను కలిగిస్తుంది.
12. వాస్తు బలంతో నిర్మించిన గృహము చిన్నదైనా ఈ గృహంలో నివసించే వారికి శుభాలు కలుగుతాయి.
13. గృహానికి తూర్పున ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అది తూర్పు ముఖ ద్వార గృహము అవుతుంది. ఆ గృహానికి తూర్పున ఉన్న గదిలోపలి కొలతను సగం చేసి ఉత్తరము వైపు వచ్చే సగభాగంలో ప్రధాన ద్వారం ఏర్పరచుకుంటే అది ఉచ్చస్థానంలో అమరి శుభఫలితాలనిస్తుంది. తూర్పున సింహాద్వారం ఉచ్చస్థానంలో వుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.
14. డాబాలపైన, మిద్దెలమీద చేసిన యజ్ఞం, యజ్ఞ ఫలములు, జపములు ఏనాటికీ ఫలించవు.
15. దక్షిణ దిశవైపు పాదములు ఉంచి నిద్రించుట పాపము. ఆ విధంగా నిద్రిస్తే అశుభాలు కలుగును.
16. గృహనిర్మాణం చేయదలచినవారు ఆ ఇంటి స్థల ఈశాన్య దిశలో మాత్రమే శంకుస్థాపన చేయాలి.
17. తూర్పు దిశ పల్లంగా వుంటే ఆ ఇంటిలో నివసించే వారందరకు సర్వశుభాలు కలుగుతాయి.
18. వివాహం జరిపించిన తరువాత సంవత్సరం లోపు గృహ నిర్మాణం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు.
19. ఇంటిలో పడమటి భాగం కంటే తూర్పు ఎక్కువ ఖాళీ వుంటే ఆ ఇంటి యజమానికి అన్ని శుభాలే.
20. ఇంటి యందు నైరుతి దిక్కులో బావులు, గుంటలు వుంటే ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి.
1. నివాసయోగ్యమైనదే వాస్తు.
2. వస్తు సముదాయముతో కూడినదే వాస్తు.
3. తప్పులేని గృహము, తప్పు చేయని మానవుడు ఉండడు.
4. నైరుతి దిక్కు శారీరక దారుఢ్యమిచ్చు.
5. ఇనుము కొనుటకు మంగళవారం శ్రేష్ఠం.
6. వాస్తు పనులకు శనివారం ఉత్తమము.
7. గది వెడల్పు కన్నా ఎత్తు శ్రేష్ఠం.
8. గడపలేని సింహద్వారము అశుభము.
9. ఒకే ఇంటిలో మూడు వంటలు అశుభము.
10. చరలగ్నమందు గృహప్రవేశము చేయరాదు.
11. జాతకమును అనుసరించే వాస్తు ఫలితము వుండును.
12. బావిపై మూత స్త్రీకి మానసిక వ్యధ.
13. మానవుని శాసించేది విధి, విధిని శాసించేది వాస్తు.
14. భర్తమాట వినేది ఎడమ వైపున ఉన్న భార్యయే.
15. ఆశలేక మరణించిన మరుజన్మలేదు.
16. మూలలందు కీలకమైనవి ఈశాన్య, నైరుతిలు.
17. ముహూర్తము అనగా రెప్పపాటు కాలము.
18. వీధి ఆగిన చివర ఇండ్ల నివాసము అనర్థం
19. టి.వి. తూర్పు దిక్కునందు ఉంచుట శ్రేష్ఠము.
20. వాస్తు అంశములకు అనుగుణంగా జీవించిన చెడు ఫలము తక్కువ.